14, డిసెంబర్ 2016, బుధవారం

Take care About Install Application

eనాడు సౌజన్యంతో.... 
ఆప్‌ ఎంపికలో...
గూగుల్‌ ప్లేని రోజూ ఓపెన్‌ చేస్తాం...ఆప్స్‌ చూస్తాం... ఇన్‌స్టాల్‌ చేస్తాం...కానీ, ఎలాంటివి డౌన్‌లోడ్‌ చేస్తున్నాం? సరైన ఆప్స్‌ ఎంపికలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నాం?ఎప్పుడైనా ఆలోచించారా?
ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో స్మార్ట్‌ మొబైల్‌ చేతిలో ఉంటే చాలు. అవసరం ఏదైనా గూగుల్‌ ప్లేలోకి వెళ్లి ఆప్‌ కోసం వెతుకులాటే. ఒకటా... రెండా... లెక్కకు మిక్కిలి ఆప్స్‌. ఒకే అవసరానికి వందల సంఖ్యలో కనిపిస్తాయి. అన్నింటినీ ఇన్‌స్టాల్‌ చేసుకుంటూ వెళ్తే! ఫోన్‌ మెమొరీ ఖాళీనే! మరైతే వాటిల్లో ఏది సరైన ఆప్‌? ఎంపిక చేయడం ఓ కళే! ఇవిగోండి కొన్ని చిట్కాలు!
మీకు సరిపడేవి... 
ఆండ్రాయిడ్‌ ఫోన్‌ని ఎప్పటి నుంచో వాడుతున్నారా? అయితే, ఇన్‌స్టాల్‌ చేసిన ఆప్స్‌తో ఆప్స్‌ లైబ్రరీ క్రియేట్‌ అవుతుంది. దీంతో మీరెప్పుడు గూగుల్‌ ప్లేలోకి వెళ్లినా హోం స్క్రీన్‌లోని Apps & Games విభాగంలో Recommended for You జాబితా కనిపిస్తుంది. ముందు వాటిపై ఓ కన్నేయండి. ఎందుకంటే ఇన్‌స్టాల్‌ చేసిన ఆప్స్‌ ఆధారంగా మీ అభిరుచికి సరిపడే వాటిని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. అంతేకాదు... గూగుల్‌ ప్లస్‌లో మీ స్నేహితులు వాడుతున్న ఆప్స్‌ ట్రాక్‌ అయ్యి రికమండేషన్స్‌లోనే కనిపిస్తాయి.
ఇంకా ఏమున్నాయి... 
ఆప్‌ని సెలెక్ట్‌ చేసి వెంటనే ఇన్‌స్టాల్‌ చేయడం మామూలే! కానీ, ఎంపిక చేసిన ఆప్‌ లాంటివి ఇంకా ఏమున్నాయో ఓ మారు బ్రౌజ్‌ చేసి చూద్దాం అనుకుంటే? Similar apps సెక్షన్‌లో చూడండి. రేటింగ్‌ ఆధారంగా మీరు సెలెక్ట్‌ చేసిన ఆప్స్‌ ఇంకా ఏమేం ఉన్నాయో చెక్‌ చేసి చూడొచ్చు.
ఇతరులు వాడేవేంటి? 
మీ అవసరానికి తగిన ఆప్‌ని ఎంపిక చేశారు. వెంటనే ఇన్‌స్టాల్‌ చేయకుండా ఇతరులు ఏమేం వాడుతున్నారో చూడండి. అందుకు ఏం చేయాలంటే... ఆప్‌ని ఎంపిక చేశాక కిందికి స్క్రోల్‌ చేయండి. users also installed సెక్షన్‌ కనిపిస్తుంది. దాంట్లో మీరు సెలెక్ట్‌ చేసిన ఆప్‌ని అప్పటికే వాడుతున్న యూజర్లు... ఇంకా ఏమేం ఆప్స్‌ వాడుతున్నారో చూడొచ్చు. వాటి రేటింగ్‌ ఆధారంగా ఆయా ఆప్స్‌ ప్రయోజనాన్ని అంచనా వేయవచ్చు.
రివ్యూలు... రేటింగ్‌లు 
సెలెక్ట్‌ చేసిన ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసే ముందు ఆప్‌కి ఉన్న ఆదరణని విశ్లేషించండి. కొన్ని రివ్యూలను నిశితంగా పరిశీలించాలి. తర్వాత ఆప్‌కి స్టార్‌లతో ఇచ్చిన రేటింగ్‌ని చూడండి. నాలుగు స్టార్‌ల పైనే రేటింగ్‌ ఉంటే ప్రయత్నించొచ్చు. మూడు స్టార్‌ల కంటే తక్కువ ఉంటే ఒకటికి రెండు సార్లు పరిశీలించాల్సిందే. అలాగే, రివ్యూ ఎంత మంది రాశారో చెక్‌ చేయడంతో పాటు... డౌన్‌లోడ్స్‌ సంఖ్యని పరిశీలించండి.
డెవలపర్‌ ఆప్స్‌... 
మీరొక ఆప్‌ని ఎప్పటి నుంచో వాడుతున్నారు. దాన్ని రూపొందించిన డెవలపర్‌ ఇంకా ఏమేం ఆప్స్‌ అందిస్తున్నారో బ్రౌజ్‌ చేద్దాం అనుకుంటే? ఉదాహరణకు ఫేస్‌బుక్‌ వాడుతున్నారు... ఆ కంపెనీ డెవలపర్స్‌ అందించే మరిన్ని ఆప్‌లను బ్రౌజ్‌ చేయడానికి గూగుల్‌ ప్లేలో ఫేస్‌బుక్‌ ఆప్‌ని సెలెక్ట్‌ చేసి కిందికి స్క్రోల్‌ చేస్తే More by Facebook సెక్షన్‌ కనిపిస్తుంది. సెలెక్ట్‌ చేస్తే ఫేస్‌బుక్‌ అందించే మొత్తం ఆప్స్‌ జాబితా వస్తుంది.
అప్‌డేట్‌ ఎప్పుడో? 
ఎంపిక చేసుకున్న ఆప్‌ని ఎప్పుడు ఆప్‌డేట్‌ చేశారో చెక్‌ చేయండి. అందుకు ఆప్‌ని సెలెక్ట్‌ చేశాక More లోకి వెళ్లండి. ఆప్‌కి సంబంధించిన సమాచారంతో పాటు What's New బాక్స్‌లో కొత్తగా ఏం అప్‌డేట్‌ చేశారో చూడొచ్చు. దాని కిందే ఆప్‌ వెర్షన్‌తో పాటు... ఏ తేదీన అప్‌డేట్‌ చేశారో చెక్‌ చేయవచ్చు. ఒకవేళ ఆప్‌ని కొన్ని సంవత్సరాల ముందు నుంచి అప్‌డేట్‌ చేయకుండా ఉన్నట్లయితే ఇన్‌స్టాల్‌ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అప్‌డేట్‌ లేని ఆప్‌తో వైరస్‌లు ఫోన్‌లోకి సులువుగా ప్రవేశిస్తాయని గ్రహించాలి.
ఎడిటర్‌ ఛాయిస్‌... 
గూగుల్‌ ప్లే నిర్వాహకులు నిత్యం ఆప్స్‌ని మానిటర్‌ చేస్తూ ఎక్కువ ఆదరణ పొందిన, ఆసక్తికరమైన వాటిని ప్రత్యేకంగా హైలైట్‌ చేసి అందిస్తున్నారు. వాటిని Editors' Choice సెక్షన్‌లో చూడొచ్చు. గేమ్స్‌, ఆప్స్‌ అన్నీ కలగలుపుగా ఉంటాయి. నచ్చిన వాటిని ఎలాంటి సందేహం లేకుండా ఇన్‌స్టాల్‌ చేసి వాడుకోవచ్చు.
విభాగాల వారీగా... 
వివిధ రంగాలకు సరిపడే ఆప్స్‌ని బ్రౌజ్‌ చేద్దాం అనుకుంటే Categories మెనూలోకి వెళ్లండి. ‘టాప్‌ కేటగిరీస్‌’లో ఫొటోగ్రఫీ, ఫ్యామిలీ, మ్యూజిక్‌, షాపింగ్‌... లాంటివి ఐకాన్‌ గుర్తులతో కనిపిస్తాయి. మరిన్ని రంగాల్ని వెతికేందుకు all Categories సెలెక్ట్‌ చేయండి.
టాప్‌’ జాబితా... 
ఎక్కువగా ఆదరణ పొందిన ఆప్స్‌ని విభాగాల వారీగా Top Charts సెక్షన్‌లో పొందొచ్చు.

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి