24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

Whats app new status feature

వాట్సప్‌లో కొత్త మార్పులు.. మీకు తెలుసా?
మహాశివరాత్రి సందర్భంగా వాట్సప్‌లో సందేశాలు పంపాలని చూసినప్పుడు అందులో మీకు ఏమైనా కొత్తగా కనిపించిందా? సాధారణంగా ఇంతకుముందు మీకు కనిపించే కాల్స్, చాట్స్, కాంటాక్ట్స్ స్థానంలో వేరేవి వచ్చినట్లు గమనించారా? ముందు ఒక కెమెరా సింబల్, ఆ తర్వాత చాట్స్, స్టేటస్, కాల్స్ అనే నాలుగు కొత్తగా వచ్చాయి. కాంటాక్ట్స్ అనేది నేరుగా కనిపించడం మానేసింది. ఈ మార్పులను వాట్సప్ ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఇందులో 'స్టేటస్' కొత్తగా హోం స్క్రీన్ మీదకు వచ్చి చేరింది. ఇంతకుముందు సెట్టింగులలో స్టేటస్ అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉన్నా, ఇప్పుడు కనిపించే స్టేటస్ మరింత డైనమిక్‌గా ఉంది. ఇందులో మన కాంటాక్టులలో ఎవరైనా కొత్తగా స్టేటస్ మారిస్తే ఆ విషయం కూడా మన 'స్టేటస్' గుర్తు కింద కనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరు ప్రొఫైల్ పిక్చర్ మార్చారు, స్టేటస్ అప్‌డేట్ చేశారనే వివరాలు ఉంటాయి. దానికి రిప్లై ఇచ్చేందుకు కూడా ఐదు సెకన్ల సమయం ఉంటుంది. ఇంతకుముందు స్టేటస్‌ అంటే కేవలం ప్రొఫైల్ పిక్చర్ (డీపీ) మార్చడం, చిన్న వాక్యం ఏమైనా పెట్టడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చిన్న పాటి వీడియో లేదా ఫొటోను కూడా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.
ఫిబ్రవరి 24వ తేదీ వాట్సప్ 8వ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ఫీచర్‌ను ప్రకటిస్తున్నట్లు వాట్సప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాన్ కౌమ్ తెలిపారు. చాట్‌లలాగే ఈ స్టేటస్ అప్‌డేట్లు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ కావడంతో వేరే ఎవరైనా మధ్యలో చూస్తారన్న భయం అవసరం లేదు. కేవలం మన కాంటాక్టులలో ఉన్నవాళ్లకు మాత్రమే అవి కనిపిస్తాయి. అంతేకాదు, మనం పెట్టిన స్టేటస్ మెసేజిలు 24 గంటల తర్వాత ఆటోమేటిగ్గా మాయమైపోతాయి. అంటే.. యూజర్లు మరింత ఎక్కువగా వాట్సప్‌ను వాడేలా చేసేందుకు ఈ స్టేటస్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ యూజర్లందరూ ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించుకుని ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లను తమ స్టేటస్‌గా పెట్టుకోవచ్చని, రోజంతా ఆ విషయాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేయవచ్చని వాట్సప్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఎవరెవరు చూడచ్చు?
మనం స్టేటస్ మార్చినప్పుడు దాన్ని ఎవరెవరు చూడచ్చో, ఎవరు చూడకూడదో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం స్టేటస్ ప్రైవసీ అనేది ఒకటి ఉంది. అందులో మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్, ఓన్లీ షేర్ విత్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మన కాంటాక్టులలో ఉన్నవాళ్లంతా చూడచ్చంటే మొదటిది, ఒకరిద్దరు తప్ప అనుకుంటే రెండోది, కేవలం కొంతమంది మాత్రమే అనుకుంటే మూడోది మనం సెలెక్ట్ చేసుకోవాలి. డీఫాల్ట్ మాత్రం మొదటిదే ఉంటుంది.
మరి కాంటాక్టులు ఎక్కడ?
ఇప్పుడు కొత్తగా అప్‌డేట్ అయిన వాట్సప్‌లో కాంటాక్టులు నేరుగా కనిపించవు. మరి వాటిని ఎక్కడ వెతికి పట్టుకోవాలంటే.. మనం చాట్స్ అనే ట్యాబ్‌లో ఉన్నప్పుడు క్రింద రైట్ పక్కన ఉండే సింబల్‌ను టచ్ చేస్తే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోడానికి వీలుగా మొత్తం కాంటాక్టులు వస్తాయి. ఇంతకుముందు కాంటాక్టులు చూసినప్పుడే అందులో వాళ్ల స్టేటస్ కూడా కనిపించేది. ఇప్పుడు అలా కాకుండా కేవలం వాళ్ల ప్రొఫైల్ పిక్చర్, మనం సేవ్ చేసుకున్న పేరు మాత్రమే వస్తున్నాయి.
    

1 వ్యాఖ్య:


  1. తడిసి మోతడైందని ఈ వాట్సాపు కొత్త ఫీచర్ వల్ల ఏమన్నా ఒరిగిందా ? వాట్సాప్ రామ్ స్పెస్ యూసేజ్ ఎక్కువవడం తప్పించి ?

    ఇంకో రెండు సంవత్సరాల్లో తాను పెట్టే ఉపయోగం లేని ఫీచర్స్ బరువు వల్లే వాట్సాపు కొలాప్స్ అయినా అవ్వచ్చేమో (స్కైప్ లా)

    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు